రాజౌరీలోని బేరి పట్టాన్ ప్రాంతంలో ఏప్రిల్ 12 – 13 మధ్య రాత్రి పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. నియంత్రణ రేఖ(ఎల్ఓసి)లో అనుమానస్పదంగా కదులాడుతుండడంతో ఆ డ్రోన్‌ను కూల్చివేశారు.
‘నియంత్రణ రేఖపై అనుమానస్పదంగా డ్రోన్ కదులాడుతోందని తెలియగానే కార్డన్, సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. డ్రోన్ కదలికలను ట్రాక్ చేశారు. లోడ్‌చేసిన ఐదు ఎకె మ్యాగజైన్లు, కొంత డబ్బు, సీల్డ్ ప్యాకెట్ ఆ డ్రోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని సైనిక పిఆర్వో తెలిపారు. భారత సైన్యం, పోలీస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సెక్టార్‌లోని సుందర్బనిలో ఆ డ్రోన్‌ను కూల్చేశారు.
సైన్యం హెక్సాకాప్టర్(డ్రోన్)ను స్వాధీనం చేసుకుని 28వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ వద్దకు తీసుకొచ్చింది. తర్వాత తెరిచి చూసినప్పుడు ఇవి అందులో దొరికాయి: 1) రెండు లక్షల భారత కరెన్సీ, 2)131 రౌండ్స్, 3)ఐదు మ్యాగజైన్స్, 4)ఐదు స్లింగ్స్, 5) నాలుగు బ్యాటరీలు ఉన్న హెక్సాకాప్టర్. దీనికి ముందు కూడా మార్చి 10న పాకిస్థాన్ డ్రోన్‌ను, ఫిబ్రవరి 26న ఇంకో పాకిస్థాన్ డ్రోన్‌ను బిఎస్ఎఫ్ సిబ్బంది కూల్చేశారు.