విశాఖ సముద్ర తీరంలో డాల్ఫిన్ ప్రత్యక్షమైంది. అరుదైన సముద్ర జీవిగా గుర్తించిన ఈ డాల్ఫిన్ అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెం తీరానికి కొట్టుకొచ్చింది. ఆ జీవి కొన ఊపిరితో ఉండటంతో.. వెంటనే గమనించిన మత్స్యకార యువకులు ప్రాణాలతో సముద్రంలోకి పంపించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలంకాలేదు. ఈ డాల్ఫిన్ ఎనిమిది అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు ఉందని మత్స్యకారులు తెలిపారు.
ఈ డాల్ఫిన్ 200 కేజీల వరకు బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రసాయన కంపెనీల వ్యర్థాలు శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్యసంపదతో పాటు అరుదైన జాతికి చెందిన తాబేళ్లు, డాల్ఫిన్లు, తిమింగలాలు ఎక్కువగా చనిపోతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. తిక్కవానిపాలెం, పూడిమడక పరిధిలో రసాయన కంపెనీల వ్యర్థాలను సముద్రంలోకి కలిపే పైపులైన్ల వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించారు.