AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్ ప్రజల కోసం దేనికైనా సిద్ధం:కంది శ్రీనివాస రెడ్డి

ఆదిలాబాద్ లోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. విశ్రాంత ఉద్యోగులను ఆత్మీయంగా పలకరించి.. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిస్థితులపై ప్రస్తావించారు. ఆదిలాబాద్ అభివృద్దిలో వెనుకపడిందని.. ఆదిలాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ లో అన్ని వనరులు ఉన్నప్పటికీ.. అభివృద్ధి శూన్యమన్నారు కంది శ్రీనివాస రెడ్డి. నీటి వనరులు, రవాణా సదుపాయాలు ఉన్నాయని.. పరిశ్రమల ఏర్పాటుకు ఆదిలాబాద్ అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న స్వార్ధానికి.. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. జోగు రామన్నకు కనీసం జీఓ చదవడం కూడా రాదని.. ఆయనకు కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవటం, కబ్జాలు చేయడమే తెలుసని విమర్శించారు. తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని.. తాను సంపాదించిన డబ్బును ఆదిలాబాద్ డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేస్తానని చెప్పారు. రాబోయే తరాలకు ఆదిలాబాద్‌ను ఒక మోడల్‌గా చూపిద్దామని కోరారు.

అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నానని, మంత్రి కేటీఆర్ కంటే ఎక్కువగా చదివానని కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. అమెరికాలో, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్ ప్రజల కోసం పారిశ్రామికవేత్తలను బతిమాలి అయినా ఆదిలాబాద్ కు పరిశ్రమలను తీసుకొస్తానని చెప్పారు. మంత్రి కేటీఆర్, హరీష్ రావులు తమ నియోజవర్గాలను అద్భుతంగా అభివృద్ధి చేశారని.. ఆదిలాబాద్ ను మనం ఎందుకు ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవద్దని ప్రశ్నించారు. మన జిల్లాను అభివృద్ధి చేసుకునే తెలివితేటలు మనకు ఉన్నాయని, భవిష్యత్తు తరాల కోసం ఆదిలాబాద్ ను అందంగా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. తనకు అవకాశమిస్తే.. అతి త్వరలో ఆదిలాబాద్‌ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామి ఇచ్చారు.

తనకు జెండాలు, పార్టీలు ముఖ్యం కాదని.. ఆదిలాబాద్ ప్రజలే తనకు హై కమైండ్‌ అని.. వాళ్ళు చెప్పినట్టే వింటానని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా.. భయపడేది లేదని, ఆదిలాబాద్ ప్రజల కోసం ఏమైనా చేస్తానని తెలిపారు. లక్ష సార్లు జైలుకు పంపినా ఆదిలాబాద్ కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. భయపడితే ఎదగలేమని.. అక్రమార్కులపై, అవినీతిపరులపై ఎదురుతిరిగితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.ఆదిలాబాద్ లో కనీసం సీసీరోడ్లు,వీధి దీపాలు,నాళాలు కూడా సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదిలాబాద్ కోసం ఎవ్వరినైనా గల్లా పట్టి ప్రశ్నిస్తానని అన్నారు.ఆదిలాబాద్ ప్రజల కోసం తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు.

తనకు కులాల,మతాల పట్టింపు లేవని..కేవలం ఆదిలాబాద్ అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు కంది శ్రీనివాస రెడ్డి.వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో బీజేపీ జెండా ఎగురుతోందని ధీమా వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో అనుభవుజ్ఞులని, వారి ఆలోచనలు, సలహాలు తనకు చెప్పాలని.. ఆదిలాబాద్ డెవలప్ మెంట్ కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10