ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని..వాటిని కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. BHELకు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలు బతికితేనే ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తోందని ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
SAIL ద్వారా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పరిశీలిస్తామని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానిని కలిశానని వెల్లడించారు. బయ్యారం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని.. విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని అన్నారు. ముంద్రాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు అదానీ ప్రకటించారని,అదానీ కంపెనీకి నష్టం వస్తుందనే..బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీని నిరాకరించారని తెలిపారు. బయ్యారంలో నాణ్యత లేదనడం కరెక్ట్ కాదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనుక భారీ కుట్ర ఉందని అన్నారు. ఒక్క బైలదిల్లాను అదానీకి కట్టబెట్టడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలను దెబ్బకొట్టారన్నారు. బైలదిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడిందని, బైలదిల్లా ఖనిజం విలువ రూ.6 లక్షల కోట్లు అని తెలిపారు. అదానీ కబంధహస్తాల నుంచి బైలదిల్లా బయటపడాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేసీఆర్ మొగ్గు చూపారని అన్నారు. బీమా పథకాలన్నీ ఎల్ఐసీకి అప్పగించారని,నష్టాలను జాతికి అంకితం చేయడం..లాభాలు నచ్చిన వ్యక్తులకు అప్పగించడం కేంద్రం ఆలోచన అని విమర్శించారు.