గవర్నర్ వ్యవస్థపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అత్యున్నత రాజ్యాంగ పదవులు సైతం కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం తీర్మానం చేయడంపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ పాస్ చేయడం లేదని.. ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా గవర్నర్ పని చేస్తున్నారని స్టాలిన్ గవర్నమెంట్ తీర్మానం చేసింది. దీనిపై వచ్చిన వార్తల ను ట్విట్టర్ లో జతచేస్తూ.. మంత్రి కేటీఆర్ గవర్నర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని.. రాష్ట్రాల అభివృద్ధికి ఎలాంటి సహకారం లేకుండా ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఇది నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధికి సహకరించే కో-ఆపరేటివ్ ఫెడరలిజం ఇదేనా..? టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ కు వ్యతిరేకంగా ఇప్పటికీ రెండు తీర్మానాలు చేసింది.