జూపల్లి కృష్ణారావు సస్పెన్షన్ తో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్ లో రాజకీయం వేడెక్కింది. జూపల్లి కృష్ణరావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డిల మధ్య ఇన్నాళ్లు సాగిన అంతర్గత కుమ్ములాటలు.. నేడు బహిరంగంగా నువ్వా.. నేనా అన్నట్టు సాగుతున్నాయి. మొన్నటివరకూ బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న జూపల్లి.. పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడంతో నేడు బహిరంగ పోరుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ పై పోటీకి రెడీ అవుతున్నారు.
కొల్లాపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.ఎమ్మెల్యేకు ఏ మాత్రం తీసిపోకుండా జూపల్లి సైతం పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. నేడు కొల్లాపూర్ లోని ఎస్ఎం గార్డెన్స్ లో జూపల్లి సమ్మేళనం నిర్వహిస్తుండగా.. చిన్నంబాయిలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.జూపల్లి నిన్న సస్పెండ్ అవ్వడం.. నేడు సమ్మేళనం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.మరోవైపు హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ లో తన పట్టును నిరూపించుకొనేందుకు ఆత్మీయ సమ్మేళనాలను ఆయుధంగా మలుచుకుంటున్నారు.ఏది ఏమైనా కొల్లాపూర్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు..ఈ సమ్మేళనాల ద్వారా ఇద్దరు నేతలు చెప్పాలనుకుంటున్నారు అనేది చర్చనీయాంశమైంది.