క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామంటూ సైబర్ కేటుగాళ్లు.. ఓ వ్యక్తికి కుచ్చుటోపి పెట్టారు. ఓ వినియోగదారుడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని.. రూ.20000 వేలు టోకరా వేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి నాలుగు నెలలుగా యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలో మరో కొత్త క్రెడిట్ కార్డును బ్యాంకు అధికారులు నాగరాజుకు పంపించారు. ఆ కార్డును యాక్టివేట్ చేసేందుకు.. ఆన్ లైన్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికిన నాగరాజుకు సైబర్ కేటుగాళ్లు వల వేశారు. నాగరాజుకు కాల్ చేసి కార్డు యాక్టివేట్ చేస్తామని.. ఫోన్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరారు. నాగరాజు ఆ ఓటీపీ చెప్పడంతో .. అతని క్రెడిట్ కార్డు నుంచి 20 వేల రూపాయలు డ్రా చేశారు.తర్వాత కార్డు యాక్టివేట్ కాకపోవడం,సదరు నెంబర్ కు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో.. నాగరాజు మోసపోయినట్టు గ్రహించి.. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.