కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. డప్పు వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఆయన వ్యవహరించనున్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీ పెద్దలకు మల్లు రవి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే.
సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మల్లు రవి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన 15 అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారని ప్రస్తావించారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.