అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. బంగారు వర్ణంలో ఠీవీగా నడుస్తున్న పులిని ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆపై ఆయన తన సోషల్ మీడియాలో ఈ పులి ఫొటో, వీడియోలు పంచుకోగా.. అసోం ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ వీటిని ట్వీట్ చేసింది. దీనికి సీఎం కామెంట్ నూ జోడించింది. ‘రాష్ట్రంలోని అరుదైన వన్యప్రాణులకు నిదర్శనం ఈ వీడియో.. కజిరంగా నేషనల్ పార్క్ లో ఇటీవల కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్ టైగర్ ఇది’ అంటూ సీఎం హిమంత బిస్వ శర్మ కామెంట్ చేశారు.
ఈ వీడియో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గౌరవ్ రాంనారాయనణ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇదొక జీవిత కాల అనుభవం అని అన్నాడు. ఈ నెల 24న కొంతమంది అతిథులను కజిరంగా పార్క్ లో సఫారీ రైడ్ కు తీసుకెళ్లానని చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నం సుమారు మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో ఈ అరుదైన గోల్డెన్ టైగర్ తమకు ఎదురైందని తెలిపాడు. తమ వాహనానికి దాదాపు 80 మీటర్ల చేరువలోకి వచ్చిందని వివరించాడు. వెంటనే తన దగ్గరున్న కెమెరాలో పులిని రికార్డు చేశానని చెప్పాడు.
ఇలాంటి ఘటన తన జీవితంలో మరోసారి ఎదురవుతుందని తాను అనుకోవడంలేదన్నాడు. గతంలోనూ పలువురు ఫొటోగ్రాఫర్లు గోల్డెన్ టైగర్ ఫొటో తీసినా అవి అంత క్వాలిటీగా లేవని చెప్పాడు. వెలుతురు సరిగా లేకపోవడం వల్లో, మరీ దూరం నుంచి తీయడం వల్లో ఆ ఫొటోలు బాగా రాలేదన్నాడు. కాగా, కజిరంగా నేషనల్ పార్క్ లో గోల్డెన్ టైగర్ ఒకటికంటే ఎక్కువే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఒకేసారి రెండు కనిపించడం కానీ, కెమెరాలకు చిక్కడం కానీ ఇంతవరకు జరగలేదు. దీంతో ఇదొక్కటే తిరుగుతూ వేర్వేరు చోట్ల కనిపించిందా లేక ఇలాంటి పులులు మరికొన్ని ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదని అంటున్నారు.