తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన జిల్లాల విభజనపై తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసిందని చెప్పారు.
జిల్లాల ఏర్పాటులో సర్కారు కన్నా ప్రజల నిర్ణయమే కీలకమని కోదండరాం అన్నారు. జిల్లాల ఏర్పాటుకు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాని, ఓ కమిటీ వేయాలని తెలిపారు. జిల్లాలో ప్రజల మౌలిక సదుపాయలతో పాటు ప్రజల జీవన, ఆర్థిక, బౌగోళిక అంశాలపై చర్చించాలని చెప్పారు.
బీఆర్ఎస్ సర్కారు ఓ జిల్లాలో రాజకీయాల లబ్ధి కోసం ప్రజలను అస్తవ్యస్తం చేసిందని కోదండరాం అన్నారు. హుజురాబాద్ ఉద్యమకారులు ఉన్న గడ్డ ప్రాంతమని చెప్పారు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేది కాదని, తెలంగాణలో నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందని అన్నారు.
అధికారం లేకుంటే జీర్ణించుకోలేని స్థితి కొందరిలో నెలకొందని కోదండరాం విమర్శించారు. కాగా, ఇటీవలే కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడైన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. డి.రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీ కాలం ముగియడంతో వారి స్థానాల్లో కోదండరాం, అలీఖాన్‌ను నామినేట్ చేశారు.