ఇటీవల కాలంలో ఇండిగో విమానాలు ఏదో ఒక కారణంతో తరచుగా వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. గత అర్ధరాత్రి ముంబయి నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అయింది. విమానంలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలమే అందుకు కారణం.
“నా సీటు కింద బాంబు ఉంది” అంటూ అతడు చెప్పేసరికి అందరూ అదిరిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ముంబయి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు ఇండిగో విమానాన్ని అణువణువు తనిఖీ చేశారు. చివరికి బాంబు ఏమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని ముంబయి పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై సెక్షన్ 506(2), సెక్షన్ 505(1) (B) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు… 27 ఏళ్ల ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు అలా చెప్పాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.