తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పాజిటివ్ న్యూస్ వినిపించింది రేవంత్ సర్కార్. రిపబ్లిక్ డే కంటే ఓ రోజు ముందుగానే.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపటంతో.. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారి చేసింది. ఇక.. నిన్న టీఎస్సీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేందుకు కీలక ముందడుగు పడ్డట్టయింది. ఈ మేరకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కీలక ప్రకటన చేశారు. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించామని.. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం రోజు చిలుకూరులో పర్యటించిన భట్టి.. ఈ వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగులకు సరైన ఉద్యోగావకాశాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. పదేళ్ల నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే దిమ్మతిరిగే జవాబు చెబుతామని భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటనలకు వస్తే ముందస్తుగానే అరెస్టులు చేసే సంస్కృతి ఉండేదని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్లు ఉండాలని… అందుకే ధర్నా చౌక్‌ని తెరిపించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమించింది. ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులను సంప్రదించి ఈ మేరకు కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్‌సెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ బి.డీన్ కుమార్‌ను.. పీజీఈసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ అరుణ కుమారిని.. ఐసెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారిని.. ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్‌ను.. లాసెట్, పీజీ ఎల్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ విజయలక్ష్మిని.. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని.. పీఈ సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్‌ను నియమిస్తూ.. ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది.