ఓ వరుడికి బెంగళూరులో ట్రాఫిక్ వరంలా మారి.. పారిపోవడానికి సహకరించడం గమనార్హం. ఫిబ్రవరి 16న మహదేవపురాలోని టెక్ కారిడార్‌లో కారు ఇరుక్కుపోగా.. పెళ్లి ఇష్టంలేని వరుడు ఇదే అదునుగా భావించి పారిపోయాడు. అతడ్ని పట్టుకోడానికి వధువు ప్రయత్నించి విఫలమైంది. భర్తను వెంబడిరచిన ఆమె.. అతడి వేగాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో రెండు వారాలుగా అతడు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియరాలేదు. గత నెల 16న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన విజయ్ జార్జ్ అనే యువకుడికి ఫిబ్రవరి 15న వివాహం జరిగింది.
మర్నాడు కొత్త దంపతులు ఇద్దరూ చర్చికి వెళ్లి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో వీరి కారు మహాదేవపుర టెక్ కారిడార్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ సమయంలో ముందు సీటులో కూర్చున్న విజయ్ జార్జ్.. ఠక్కున డోరు తీసుకుని బయటకు పరుగులు తీశాడు. భర్త అలా చేయడంతో షాక్‌లోకి వెళ్లిపోయిన యువతి.. వెంటనే తేరుకుని అతడి వెంట పరుగులు తీసింది. అయినా అందుకోలేకపోయింది. రెండు వారాలు దాటినా భర్త ఆచూకీ తెలియకపోవడంతో ఆమె మార్చి 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది.