AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గర్భిణికి ఆపరేషన్ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ.. తల్లీబిడ్డలు క్షేమం

తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలల్లో ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. అయితే వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా తమ వృత్తి ధర్మాన్ని మాత్రం మారిచిపోవడం లేదు. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ వంశీకృష్ణ తన గొప్ప మనసు చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. సిజేరియన్ చేసి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడి వైద్యవృత్తికే వన్నె తెచ్చారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో శుక్రవారం సాయంత్రం చోటుచేసు కుంది. ప్రజ సేవకే కాదు ప్రజారోగ్యాన్ని బాధ్యతగా స్వీకరించిన ఎమ్మెల్యే వంశీక‌‌ృష్ణపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

నాగర్ ​కర్నూల్ జిల్లా లింగాల మండలం జింగుబల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకు తొమ్మిది నెలలు నిండాయి. ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తెలిసింది. ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ, హైరిస్కు కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూచించారు.

ఆర్థిక స్తోమత లేకపోవడం, గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగుతుందన్న భయంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆందోళన చెందవద్దని గర్భిణి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వెంటనే సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఆ వెంటనే హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్‌ చేశారు. ప్రసన్న పండంటి ఆడ శిశువు జన్మనివ్వగా, తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యే వంశీకృష్ణకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఇప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండిలా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కావలసిన సిబ్బందిని ఏర్పాటు చేస్తానని ఎల్లప్పుడూ అచ్చంపేట ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే అన్నారు. అచ్చంపేట ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్ళొద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కావల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10