రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే పతంగులు ఎగురవేస్తారని, ఆ పతంగులకు దారం ఆధారమైతే, పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద కైట్ ఫెస్టివల్‌ను హరీశ్‌రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో మూడు రోజుల పాటు కన్నుల పండువగా పతంగుల పండగ జరుగుతుందన్నారు. మకర సంక్రాంతి అనేది శీతాకాలపు అధికారిక ముగింపు అని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రశాంతమైన ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న వివిధ రంగుల గాలిపటాలను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తయారుచేసే బెల్లం, నువ్వుల గింజలతో లడ్డూలు తయారు చేయబడతాయి. ఈ లడ్డూలు తింటే శరీరంలో వేడి వస్తుందని నమ్ముతాం. కాబట్టి సంవత్సరంలో ఈ అత్యంత శీతల సమయానికి తగిన ఆహారం అని పేర్కొన్నారు. చివరికి ఈ ప్రత్యేక రోజున, ప్రజలు గాలిపటాలు ఎగురవేసే విధంగా వినోద కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. ఈ సంప్రదాయం చాలా పరిణామం చెంది ఇవాళ గాలిపటాలు ఎగరేసే టోర్నమెంట్ల దాకా వచ్చింది. యువత పతంగి పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలి. యువత ప్రతి అంశంలో స్ఫూర్తిగా నిలవాలి అని హరీశ్‌రావు సూచించారు.