AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘పైగా ప్యాలెస్’ నుంచి సీఎం రేవంత్ పాలన..? 124 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ భవనం విశేషాలివే..!

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి తన ఇంటి నుంచే పాలన సాగిస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ను క్యాంపు ఆఫీసుగా ఉపయోగించుకోగా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాని పేరును ప్రజా భవన్‌గా మార్చి డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా కేటాయించారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లో ఉంటున్నారు. సీఎం రేవంత్ క్యాంపు ఆఫీస్ కోసం చాలా ప్రాంతాలను పరిశీలించినా.. చివరకు హైదరాబాద్‌లోని ఓ చారిత్రాత్మక ప్యాలెస్‌ను ఆయన కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి ‘పైగా ప్యాలస్‌’ను సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చి అక్కడి నుండి రేవంత్ రెడ్డి సర్కారు పాలన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు పైగా ప్యాలస్‌ను ఇటీవలే సందర్శించారు. త్వరలోనే ఆ భవనాన్ని రెనోవెట్ చేసి సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చనున్నట్లు సమాచారం.

పైగా ప్యాలెస్ విశేషాలివే..
ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని ‘పైగా ప్యాలెస్‌’గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చారు. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్‌కు వచ్చేవారు.

దాదాపు 124 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్‌కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేశారు.

నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 2008 అక్టోబరు 24 నుండి హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం కేటాయించారు. 2023లో ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లో కొత్తగా యూఎస్‌ కాన్సులేట్‌ భవనం నిర్మాణం చేసి, కార్యాలయం అక్కడికి మార్చబడింది. దాంతో ఇది శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ వేదికగా మారింది. 2023లో ఈ భవనాన్ని హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ తిరిగి స్వాధీనం చేసుకొని, దాని నిర్వహణను పర్యవేక్షిస్తుంది.

కోర్‌ సిటీలో ఎంతో విశాలంగా ఉన్న ఈ పైగా ప్యాలెస్‌ను అత్యంత కీలకమైన సేవలను అందించేందుకు వినియోగించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు యోచిస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10