గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది (Overturn). దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలిని మెహిదిపట్నానికి చెందిన మాలతిగా గుర్తించారు. బస్సు మియాపూర్ నుంచి చిత్తూరు వెళ్తున్నదని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.