AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రివర్గంలోకి కోదండరామ్..! సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ క్లియరెన్స్..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఈ రెండు అంశాలపై హైకమాండ్ తో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రెండింటి భర్తీపై హైకమాండ్ తో ఆమోద ముద్ర వేయించుకునే ఛాన్స్ ఉంది. పదేళ్ల పాటు కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు మాత్రమే నామినేటెడ్ పదవుల్లో ప్రయారిటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

అనుబంధ సంఘాలు, పార్టీలో కీలకంగా ఉండి టికెట్ రాని వారు, చివరి నిమిషంలో టికెట్ వచ్చి క్యాన్సిల్ అయిన వాళ్లు, టికెట్ రాకున్నా పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేసిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలకు సంబంధించి రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసింది.

కాగా, గవర్నర్ కోటాలో ఒక స్థానాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో స్థానం కోసం కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడు అందెశ్రీ, విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని అద్దంకి దయాకర్ కి ఇవ్వాలని నిర్ణయించారు. రెండో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. అనిల్, వేణుగోపాల్, మహేశ్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, కోదండరెడ్డిల మధ్య పోటీ ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ బేషరతుగా కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఆయనకు ఇది కచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో కోదండరామ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10