ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న వాటికీ తరచూ కొట్లాడుతున్నారు. ఇలాంటి గొడవే ఇద్దరు పసిపిల్లలను ప్రాణాలు తీసింది. పండుగ వేళ కొత్త బట్టల విషయమై తలెత్తిన గొడవ ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. భర్తను సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనివ్వమని కోరింది భార్య. దానికి మీన మేషాలు లెక్కించాడు భర్త. దీనికి కారణం అతని ఆర్ధిక పరిస్థితులే. పండుగకు బట్టలు కొనేందుకు ఇంకా జీతం రాలేదని, అయినా సరే ఏదో ఒక విధంగా కొనిస్తానని నచ్చజెప్పాడు భర్త. దీనిని జీర్ణించుకోలేని భార్య తన భర్తతో గొడవకు దిగింది. ఈ గొడవతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తన ఇద్దరు పసికందులను చంపేసింది. ఇంతటితో ఆగకుండా తానుకూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే అసలైన ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. రాంపూర్ పెంటలో నివసిస్తున్నాడు చిన్న బయన్న. ఈయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరికి 8 మంది పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన భార్యపేరు చిన్ననాగమ్మ కాగా ఆమెకు యాదమ్మ, బయమ్మతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కొత్త బట్టల కోసం భర్తలో గొడవపడిన చిన్న నాగమ్మ తన పిల్లలను గొంతు నులిమి చంపేసింది. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్లి చూసిన భర్తకు తన భార్య ఉరి వేసుకొని ఉండటం చూసి షాక్ అయ్యడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. చిన్న బయన్న కృష్ణానది సమీపంలోని బేస్ క్యాంపు వద్ద వాచర్గా పని చేస్తున్నారు. తనకు గడిచిన ఐదు నెలలుగా జీతం రావడంలేదని చెబుతున్నాడు. అయినప్పటికీ ఫైర్ లైన్ కూలీ పనికి వెళ్లి డబ్బులు సంపాదించి భార్యకు కొత్త బట్టలు కొనేందుకు మన్ననూర్ వెళ్లాడు. బట్టలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంతలోనే తన భార్య ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పేదరికమే పెనుభూతమై పసిపిల్లల ప్రాణాలు తీసింది.