ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం మహారాష్ట్ర నాసిక్‌లోని ప్రాచీన కాలా రామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడే 11 రోజుల పాటు జరిగే అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠోత్సవాలను ప్రారంభించారు. పంచవటి పరిసరాల్లో ఉన్న కాలా రామ్ మందిరంలో రాములవారి భజనలో పాల్గొన్నారు. అంత కంటే ముందు నాసిక్‌లో భారీ రోడ్ షోను నిర్వహించారు మోదీ. స్థానిక మిర్చీ చౌక్ నుంచి సంత్ జనార్ధన్ స్వామి మహారాజ్ చౌక్ వరకూ సుమారు 40 నిమిషాల పాటు సాగింది ఈ రోడ్ షో. భారతీయ జనతా పార్టీ జెండాలను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం రామ్ కుండ్‌కు చేరుకున్నారు. నాసిక్ పురోహిత్ సంఘ్ అధ్యక్షుడు సతీష్ శుక్లా ఆయనకు పగ్డీని ధరింపజేశారు. రామ్ కుండ్ వద్ద గోదావరికి పూజలు చేశారు. హారతి పట్టారు. ఈ సందర్భంగా మోదీ- అఖిల భారతీయ స్వామి సమర్థ్ గురుకుల్ పీఠం చీఫ్ అన్నాసాహెబ్ మోరె, కైలాస మఠాధిపతి స్వామి సంవిదానంద సరస్వతి, బీజేపీ సీనియర్ నేత తుషార్ భోంస్లేను కలిశారు. అనంతరం కాలా రామ్ ఆలయాన్ని సందర్శించారు. వారికి ‘హనుమాన్’ గుణపాఠం! ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే నీటితో నిండిన బకెట్‌ను స్వయంగా తానే మోసుకెళ్లారు. తడిబట్టతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా స్వచ్ఛత అభియాన్ ఉద్యమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి 22వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆలయాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలంటూ మోదీ పిలుపునిచ్చారు.