ఇంఫాల్: మణిపూర్‌లో (Manipur) హింస ఆగడం లేదు. తాజాగా తండ్రీకొడుకులతో సహా నలుగురిని హత్య చేశారు. అనుమానిత మిలిటెంట్లు వారిని చంపినట్లు పోలీసులు తెలిపారు. సెర్చ్ సందర్భంగా నలుగురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయని చెప్పారు. చురచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య బఫర్ జోన్‌లోని కొండ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ జిల్లా అకాసోయ్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం కట్టెలు సేకరించడానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు గురువారం అటవీ ప్రాంతంలో సెర్చ్ చేశారు. అక్కడ పడి ఉన్న నలుగురు వ్యక్తుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటుదారులు వారిని కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత హింసించి చంపారని పోలీసులు తెలిపారు. అనుమానిత మిలిటెంట్ల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కుకీ వర్గానికి చెందిన నలుగురిని తామే చంపినట్లు కొందరు పేర్కొన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.