తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా వారు పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి పదవీకాలం 30 నవంబర్ 2027 వరకు ఉంది.
నోటిఫికేషన్ ఇలా..
నేటి (11వ తేదీ) నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
19న నామినేషన్ల పరిశీలన.
22న నామినేషన్లు ఉపసంహరణ.
29న ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్.
పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి.
రెండు ఉపఎన్నికలు కావటంతో ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. అసెంబ్లీలోఉన్న బలాబలాలను చూసుకుంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనరల్ ఎలక్షన్ మాదిరిగానే జరిగితే 40 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ ఉండేది.. ఆ విధంగా జరిగినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునే అవకాశం ఉండేది. కానీ, ఉప ఎన్నికలు కాబట్టి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు పోటీ పడుతున్నారు.