పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ గడువు ఈరోజు అర్థరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల గడువును ఈ నెల 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడువు దగ్గరపడటం.. చలానా చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా.. గత నెల 26 నుంచి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. కోటికిపైగా చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 113 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి.
ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించింది. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయితే సర్వర్ సమస్యతో చలాన్లు కట్టలేకపోయామని.. మరోసారి గడవును పొడించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ గడువు తేదీని పెంచింది.
ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీని ప్రకటించగా, బైక్‌లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో భారీ రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.