బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)ను కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అరెస్ట్‌పై ఆయన సతీమణి అపర్ణ స్పందించారు. అసలేం జరిగిందనేది వెల్లడించారు. ఆయనను కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకోనివ్వలేదని అపర్ణ పేర్కొన్నారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. బండి సంజయ్ అరెస్ట్ లకు భయపడరని తేల్చి చెప్పారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. అల్లుడు, కూతురు చేయాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నారన్నారు. పోలీసులను చాలా వేడుకున్నప్పటికీ వినలేదని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. అయితే, ఎక్కడికి తీసుకెళ్లారు!? ఎందుకు అరెస్టు చేశారు!? అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు ఆయనను తీసుకెళుతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తొలుత, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి, దాదాపు ఒంటి గంట సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.