సన్నాహక సమావేశానికి హాజరై మంత్రులు, ముఖ్య నేతలు
నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని పిలుపు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 50 వేలకు తగ్గకుండా రావాలని దిశా నిర్దేశం
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక తప్పిదాలను ఎండ గట్టిన అమాత్యులు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సువర్ణ పాలన అందిస్తామని భరోసా
ఆదిలాబాద్ ప్రత్యేక ప్రతినిధిః మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుండి 50 వేలకు తగ్గకుండా పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని స్థానిక గాయత్రి గార్డెన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి వారంతా ముఖ్యఅతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటానికి బాధ్యత వహించిన పార్టీ కాంగ్రెస్ అంటూ గుర్తు చేశారు. గొప్ప చరిత్ర గల పార్టీ కార్యకర్తలైనందుకు మనం గర్వపడదామని అన్నారు. మన సర్కారు ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దాన్ని స్వేత పత్రాల ద్వారా ప్రజలకు వివరించేందకు అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేగుతోందని అన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించి తమ అక్రమాలు, తప్పుల్ని కప్పిపుచ్చు కునేందుకే స్వేదపత్రం పేర బీఆర్ఎస్ నాటకాలాడుతోందన్నారు.
రాబోయే ఎన్నికలలో పోటీ చేసే కార్యకర్తలు తమ సేవల్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నాగ్పూర్‌లో నిర్వహించే కాంగ్రెస్ 139వ ఆవిర్భావ సభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మతం, కులాల పేర దేశాన్ని విడగొడ్తున్న బీజేపీ నుండి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బీజేపీ హఠావో, భారత్ బచావో అన్న నినాదంతో రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారన్నారు. దేశ ప్రజల ఐకమత్యమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ల పాలనలో ప్రభుత్వరంగ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. ఈ ప్రాంతంలోని సిమెంట్ పరిశ్రమ ఆ కోవలోనిదేనని గుర్తు చేశారు. దివ్యాంగులకు రూ.6 వేల భృతి ఇవ్వాలని మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ గా తానే ప్రతిపాదించానన్నారు. ఆరు గ్యారంటీలను అతిత్వరలోనే ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వారికి కళ్లుంటే బస్టాండ్లలోకి వెళ్లి మహిళల ముఖాల్లో సంతోషం చూడాలన్నారు. నాలుగు కోట్ల జీరో టికెట్లు ప్రింటై ఉన్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నా భిన్నం చేసిందని దుయ్యబట్టారు.
ఆరు లక్షల కోట్ల కుపైగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిందెవరంటే కాంగ్రెస్ అని ఎవరైనా చెప్తారన్నారు. ప్రాజెక్టులు కట్టింది, పరిశ్రమలేర్పాటు చేసింది, ఐటీకి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తామే అంటూ బీఆర్ఎస్ చంకలు గుద్దుకోవటం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రతీ పైసాను రాష్ట్రాభివృద్ధికి ఖర్చుచేసే జవాబుదారీతనంతో ప్రజాపాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామన్నారు. పేదలకు కనీసం రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు సైతం బీఆర్ఎస్ ఇవ్వలేదన్నారు. మన సర్కార్‌లో గత పాలనలో ఎదుర్కొన్న ప్రజా సమస్యలన్నింటినీ తీర్చటం తమ ప్రధాన లక్ష్యమన్నారు. దేశ విచ్చిన్నకర శక్తులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విన్నవించారు. రాహుల్ గాంధీజీని గొప్ప ప్రధానిగా చూసేందు కోసం అందరూ కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు.
ఈ సన్నాహక సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ విష్ణునాథ్, రోహిత్ చౌదరి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు.