సింగరేణి కార్మికులకు అండగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉన్నారని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి తెలిపారు. ఆదివారం నాడు మందమర్రి INTUC కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులతో గుర్తింపు సంఘం ఎన్నికలపై సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, INTUC అధ్యక్షుడు జనక్ ప్రసాద్ ఉన్నారు. ఈ సమావేశంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ… సింగరేణి సంస్థ BIFR లో ఉన్నప్పుడు మా నాన్న కాకా వెంకటస్వామి ప్రధాని పీవీ నరసింహారావుతో మాట్లాడి లక్ష ఇరవై ఐదు వేల మంది కార్మికుల జీవితాలను కాపాడారు. కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్‌ని కాకా వెంకటస్వామి కల్పించారు. కోట్లదిమందికి మన దేశం పెన్షన్ ఎలా ఇస్తున్నారని ఇతర దేశాలు స్టడీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ ( TBGKS ) యూనియన్‌పై ఉన్న వ్యతిరేకతను కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారన్నారు. సింగరేణి ఏరియాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించకుండా కార్మికులు చెంపదెబ్బ కొట్టారని చెప్పారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త గనులు తీసుకొచ్చి ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు కొత్త క్వార్టర్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సింగరేణి సంస్థ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోరు. కార్మికులకు యాజమాన్యం నుంచి ఇబ్బందులు వస్తే పోరాటం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని.. కార్మికుల పక్షాన సీఎం ఉన్నారని చెప్పారు. 27వ తేదీన కార్మికులు గడియారం గుర్తు కి ఓటు వేసి ఐఎన్టీయూసీ ( INTUC ) ని గెలిపించాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.