ఐఏఎస్,ఐపీఎస్ అధికారులతో సీఎం రేవంత్
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈనెల 28 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో ‘ప్రజాపాలన’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు. ఆరు గ్యారెంటీలను వీలైనంత త్వరగా అమలు చేసే విషయంలో సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అధికారులు 18 గంటలు పని చేయాల్సిందేనని లేదంటే ఇప్పుడే తప్పుకోవచ్చునని చెప్పారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ మేరకు సెక్రటేరియేట్‌లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై సీఎం రేవంత్ చర్చించారు.
‘సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేం. నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులే. గ్రామసభలు ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలి. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలి. అధికారులు జవాబుదారీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలి. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారు.. కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరు. ఎంతటివారైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి.
ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎస్‌ఆర్ శంకర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలి. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంతవరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలి. భూకబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో సన్‌బర్న్ నిర్వహణపైన పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాలు తేల్చాలి. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి. పని చేయలేమనే ఉద్దేశ్యంతో ఉంటే ఇప్పుడే తప్పుకోండి. కచ్చితంగా 18 గంటలు పని చేయాల్సిందే’ అని సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించారు.