AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐటీ కడుతున్నా.. మూడున్నర ఎకరాల భూమి ఉన్నా.. రేషన్ కార్డు కట్ !

మీరు ఆదాయ పన్ను కడుతున్నారా.. మూడున్నర ఎకరాలకు మించి భూమి ఉందా.. ఇందులో ఏ ఒక్కటి అవునన్నా మీకు రేషన్ కార్డు రాదు. ఒకవేళ ఇప్పటికే మీకు ఉంటే తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈమేరకు సివిల్ సప్లై శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. రేషన్ కార్డు లేక చాలామంది పథకాలకు దూరమవుతున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ఊసే ఎత్తలేదు. కుటుంబ సభ్యుల చేరికలకూ అవకాశం ఇవ్వలేదు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం జనం పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టింది. కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చుకునే అవకాశం కల్పించనుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే పనిలో సివిల్ సప్లయ్ శాఖ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త కార్డుల దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించబోయే పలు కీలక నియమనిబంధనలు వెలుగులోకి వచ్చాయి. అనధికారిక సమాచారం ప్రకారం.. ఐటీ కడుతున్న వారికి, మూడున్నర ఎకరాలకు మించి భూమి ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమచారం.

మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించే సమయంలోనే ఇలాంటి అప్లికేషన్లను వడబోసేలా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయనున్నారు. ఇందులో భాగంగా మీసేవ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షిస్తున్న నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)కు పౌరసరఫరాల శాఖ లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారిలో ఐటీ కట్టే వారిని, మూడున్నర ఎకరాలకు పైగా భూమి ఉన్న వారిని గుర్తించి తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దరఖాస్తుదారు ఆధార్‌, పాన్‌కార్డును లింక్‌ చేసి ఆ వ్యక్తికి, అతడి కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ తెలిసేలా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై ఈ నెల 27 న ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10