హైదరాబాద్: తెలంగాణకి కొత్త ఏఐసీసీ (AICC) ఇంఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ (Dipadas Munshi)ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంకితభావం, నిబద్ధతలతో తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
అలాగే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసినందుకు, పార్టీని గైడ్ చేసినందుకు గత ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ఠాక్రేకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా సార్వత్రక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది. 12 మంది ప్రధాన కార్యదర్శులతో పాటు 11 రాష్ట్రాలకు ఇన్చార్జిలను నియమించింది. వివిధ రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జులను మార్చింది. ఇందులో భాగంగా.. ఇప్పుటి దాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్‌రావ్ ఠాక్రేను మార్చింది. పార్టీ కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ఠాక్రేను గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటి దాకా గోవా బాధ్యతలు చూస్తున్న మాణిక్కం ఠాగూర్‌కు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. నిజానికి, తెలంగాణకు అదనపు ఇన్చార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు.