తాజాగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కలు మరింత భయాలను కలిగిస్తున్నాయి. గత నెల రోజుల్లో ప్రపంచ దేశాల్లో కలిపి కొత్త కొవిడ్ కేసుల సంఖ్య 52 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ తాజాగా వెల్లడించింది.
ఈ నెల రోజుల్లోనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 8.5 లక్షల కొత్త కొవిడ్ కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్ఓ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1.18 లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినట్లు తెలిపింది. ఇక ఈ కొవిడ్ కారణంగా 3 వేల మందికిపైగా చనిపోయినట్లు వెల్లడించింది. ఇక ఈ కేసుల పెరుగుదలకు కారణం కొవిడ్ కొత్త రకమైన జేఎన్ 1 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. అయితే ఈ కరోనా కేసుల సంఖ్య పెరుగుదల మరో 2 నెలల పాటు కొనసాగుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీంతో మరోసారి ప్రపంచ దేశాలపై కొవిడ్ పడగ తప్పదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అటు భారత్‌లో కూడా ఈ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర సంచలనంగా మారింది.
ఈ క్రమంలోనే జేఎన్ 1 వేరియంట్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ఈ జేఎన్ 1 వేరియంట్ అంత ప్రమాదకరం కాదని స్పష్టం చేసింది. అదే సమయంలో వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు జేఎన్ 1 రకం వల్ల కలిగే ప్రాణాపాయాన్ని.. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కొవిడ్‌తో పాటు ఫ్లూ, పిల్లల్లో వచ్చే సాధారణ నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రకటించింది. సరైన కరోనా నిబంధనలు పాటించాలని హితవు పలికింది. మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, లక్షణాలు కనిపించినప్పుడు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించింది.