ఓటర్ కార్డ్ లేని వారికి, ఓటర్ కార్డులో ఏవైనా తప్పులు దొర్లిన, చిరునామా మార్చుకోవాలని అనుకునే వారికి ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టబోతుంది. జనవరి 1,2024 లోగా 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓటర్ల జాబితా ముసాయిదాను జనవరి 6న ప్రచురిస్తారు.అదే రోజునుంచి 22వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరించి వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 2 వ తేదీవరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటాబేస్‌లో అప్‌డేట్ చేసిన తరువాత ఫిబ్రవరి 8న ఫైనల్ లిస్ట్ ప్రచురిస్తారు. ఎవరికైతే వచ్చే సంవత్సరం అక్టోబర్‌లోగా 18 ఏళ్లు నిండుతున్నాయో వారు కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది.అయితే, వీరి దరఖాస్తుల పరిశీలన మాత్రం అక్టోబర్ 1 తరువాత నిర్వహించే కార్యక్రమం లో చేపడతారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లోగా 18సంవత్సరాలు పూర్తవుతున్నవారికీ కూడా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.