ఏకంగా 81 మంది విద్యార్థినుల సస్పెన్షన్
వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్ విద్యార్థ్దినులు ర్యాగింగ్ చేయటంతో వారు ఫిర్యాదు చేశారు. దీంతో ఏకంగా 81 మంది విద్యార్థ్ధినులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంత భారీ సంఖ్యలో సస్పెండ్ చేయటం వర్శిటీ చరిత్రలో ఇదే తొలిసారి కావటం విషయం. సాధారణంగా ర్యాంగింగ్ కేసుల్లో ఎక్కువగా అబ్బాయిల పేర్లు బయటకు వస్తుంటాయి. తాజా ఘటనలో అమ్మాయిలు పేర్లు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్లో ర్యాగింగ్‌కు పాల్పడిన 81 మంది సీనియర్ విద్యార్థ్ధినులను సస్పెండ్ చేయటం చర్చనీయాశంగా మారింది. గత కొన్ని రోజులుగా ర్యాగింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని బాధిత విద్యార్ధినిలు ఫిర్యాదు మేరకు ఏకంగా 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు వేశారు.
జూనియర్ విద్యార్థులతో పరిచయాల పేరుతో సీనియర్లు ర్యాగింగ్ చేయటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ర్యాగింగ్ చేయటంపై నిషేధం ఉన్నా వర్శిటీల్లో ఇది కొనసాగుతోంది. కానీ చాలావరకు ఘటనలు బయటకు రావు. కానీ కాకతీయ వర్సిటీలో ధైర్యం చేసి బాధితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నా విద్యార్థినుల వివరాలు సేకరించి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో పీజీ 28 , కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. ఈ 81 విద్యార్థినులను వారం రోజులు పాటు సస్పెండ్ చేశారు.