తెలంగాణలో అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం సాగింది. గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ పాలకపక్షం ముందుకు సాగింది. ఆ తరువాత అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన వాటిపై చర్చించారు మంత్రులు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని పట్టుబట్టింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రం లోటులో ఉందంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలకు ధీటుగా ప్రతిపక్షం స్పందించింది. రాష్ట్ర పరిస్థితిని అడ్డం పెట్టుకొని హామీలు అమలు చేయకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. తాము చెప్పిన ప్రతి హామీ అమలు చేస్తామని కాంగ్రెస్ ధీటుగా బదులిచ్చింది. ఆ తరువాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మధ్య తీవ్ర మాటల యుద్దం జరిగింది. పరుషపదజాలాలతో ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు.
గత పాలనలో జరిగిన అక్రమాల గురించి కూడా కాంగ్రెస్ జోరు పెంచింది. శ్వేత పత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించింది. ఇలా మాటల యుద్దంతో సాగిన సభకు నేటితో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు చివరి రోజు కావడంతో నేతలు తమ మాటలకు పదును పెంచారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నేదునూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబట్టారు. తమ పాలనలో చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ బకాయిలపై సభలో పెద్ద రచ్చ జరిగింది.