తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 20కి పెరిగింది. 19 మందికి చికిత్స కొనసాగుతోంది. కోవిడ్ నుంచి ఒకరు పూర్తిగా కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా వచ్చిన కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే నాలుగు వెలుగుచూశాయి. మెదక్ లో ఒకటి, రంగారెడ్డిలో ఒక కరోనా కేసు నమోదైంది. ఇవాళ 925 మందికి కరోనా పరీక్షలు చేశారు. 54 మందికి సంబధించిన కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఆ తర్వాత మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, కరోనా తగ్గుముఖం పట్టింది ఇక భయం లేదు అని అనుకున్న ప్రతిసారీ కొత్త వేరియంట్లు కలవర పెడుతున్నాయి. చైనాలో వ్యాప్తి చెందుతున్న JN.1 సబ్ వేరియంట్ కేరళలో తొలిసారి బయటపడింది. దీన్ని పిరోలా/BA.2.86 అని కూడా పిలుస్తున్నారు.