AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌ తొలి మ్యాచ్‌ ఎవరితో అంటే..!

వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరగాల్సి ఉన్న అండర్‌ – 19 పురుషు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు సంబంధించి రివైజ్డ్‌ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకూ దక్షిణాఫ్రికాలోని ఐదు వేదికలలో జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌.. తమ తొలి మ్యాచ్‌ను జనవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. దక్షిణాఫ్రికాలోని బ్లోంఫోంటెన్‌, ఈస్ట్‌ లండన్‌, కింబర్లీ, పోచెఫ్‌స్ట్రోమ్‌, బెనోనిలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

15వ ఎడిషన్‌గా జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొంటుండగా.. మొత్తం 41 మ్యాచ్‌లు జరుగుతాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా భారత్‌ గ్రూప్‌-ఏలో బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఎలతో ఉంది. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌ ఉండగా గ్రూప్‌-సి లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియాలు ఉన్నాయి. గ్రూప్‌ – డి నుంచి అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, నేపాల్‌లు తలపడనున్నాయి.

ఈ టోర్నీలో భారత్‌.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ తర్వాత జనవరి 25న ఐర్లాండ్‌తో, 28న యూఎస్‌ఎతో ఆడనుంది. జనవరి 19న మొదలుకాబోయే ఈ టోర్నీలో ఫిబ్రవరి 3 వరకు లీగ్‌ దశ పోటీలు జరుగుతాయి. ఫిబ్రవరి 6, 8న సెమీస్‌, 11న ఫైనల్‌ జరగాల్సి ఉంది. సూపర్‌ సిక్స్‌, గ్రూప్‌ స్టేజ్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ విధానంలో ఈ టోర్నీ జరుగనుంది.

వెస్టిండీస్‌ వేదికగా 2022లో జరిగిన గత ఎడిషన్‌లో భారత్‌.. ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఐదోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది. వాస్తవానికి 2024లో అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ శ్రీలంకలో జరగాల్సి ఉంది. కానీ ఐసీసీ ఆ దేశం సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో టోర్నీని దక్షిణాఫ్రికాకు మళ్లించిన విషయం తెలిసిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10