నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై సస్పెన్స్ వీడింది.ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ అవడంతో నేడు విచారణకు హాజరుకాలేనన్న కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది.కవిత రాసిన లేఖకు సమాధానమిస్తూ…ఈ నెల 11న విచారణకు రావాలని ఈడీ సూచించింది.దీంతో కవిత ఎల్లుండి ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరవుతారు.అదేవిధంగా కవిత ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియాతో మాట్లాడనున్నారు.ఇక మరోవైపు నేడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరగనుంది.ఈ భేటీలో కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం వుంది.ఒకవేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న దానిపై కేబినెట్‌లో చర్చించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐలు దూకుడు చూపిస్తూ వుండటం.. నేరుగా తన కుమార్తెనే టార్గెట్ చేయడంతో కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడ వేస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాగా విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులివ్వడం.. కవిత రాలేనని ఈడీకి లేఖ రాయడం.. కవిత హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలో నేడు ఉదయం కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరించడంతో ఈడీ విచారణపై సస్పెన్స్ వీడింది.ఇదిలా ఉండగా కవిత ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు.ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ దీక్ష ఉంటుందా.. లేదా.. అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.మధ్యాహ్నం కవిత ప్రెస్ మీట్ లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.