వికారాబాద్ జిల్లాలోని తాండూరులో టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బందెప్ప, సమ్మక్కలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తాండూరులోని నంబర్ వన్ ప్రభుత్వ పాఠశాలలో బందెప్ప అనే ఉపాధ్యాయుడు ప్రశ్నాపత్రం బయటకు లీక్ చేశారు. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకు ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. కొద్ది నిమిషాలకే వాట్సప్‌లో టెన్త్ పేపర్ లీక్ కావడం కలకలం రేపింది.
మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌కి వెళ్లి ఉపాధ్యాయుడు బందెప్పను ఆరా తీశారు. బందెప్పనే వాట్సప్ గ్రూపులో టెన్త్ పేపర్ పోస్ట్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. బందెప్పతో పాటు సమ్మక్కను కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పదో తరగతి పరీక్షలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ 9.30 నిమిషాలకు ప్రారంభమవ్వగా.. 9.37కు వాట్సప్‌లో ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో అది క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. పరీక్షకు ముందే లీక్ అయిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. విద్యాశాఖ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. రంగంలోకి దిగి ఎవరు లీక్ చేశారనే దానిపై ఆరా తీశారు. తాండురులోని నంబర్ వన్ ప్రభుత్వ స్కూల్ నుంచి లీక్ అయినట్లు గుర్తించారు. నలుగురు సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.