AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

8న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

ఈ నెల 8 వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ నరేంద్రమోదీ రూ. 11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్న ఆయన తొలుత సికింద్రాబాద్ – తిరుపతి మధ్య సేవలనందించనున్న వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ వందేభారత్ రైలు. ఈ రైలు వల్ల సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8.30 గంటల వరకు తగ్గనుంది. అనంతరం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూ. 715 కోట్లు ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నందు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని భూమిపూజ చేయనున్నారు. ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న 25,000 మంది ప్రయాణికుల నుంచి రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని అధికారులు పెంచనున్నారు. రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్ ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఈ స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రాటిఫైల్ బస్ స్టేషన్ కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మల్టీలెవెల్ కార్ పార్కింగ్, ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి అనేక వసతులను కల్పించనున్నారు.

సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ మధ్య రూ. 1,410 కోట్లు ఖర్చుతో పూర్తి చేసిన 85 కిలోమీటర్ల పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్ ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే సామాన్య ప్రజల రైలుగా మన్ననలు పొందిన MMTS ఫేజ్ – II లో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడవనున్న 13 కొత్త MMTS సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు. MMTS ఫేజ్ – II లో భాగంగా బొల్లారం-మేడ్చల్ మధ్య 14 కి.మీ, ఫలక్ నుమా – ఉందానగర్ మధ్యన 14 కిలోమీటర్ల పొడవున కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించారు. ఈ అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలకు సంబంధించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనను ప్రధాని తిలకించనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10