తెలంగాణ సర్కార్‌కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..
వణ్యప్రాణి సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పులులను సంరక్షించే బాధ్యత ప్రభుత్వానికి లేదా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు కేంద్రమంత్రి. ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ, పోషణకు బడ్జెట్‌లో ప్రకటించిన 2.2 కోట్ల నిధులను రాష్ట్ర వాటాలో భాగంగా కేటాయించలేదని ఆరోపించారు.
మనదేశంలో పులుల సంరక్షణను ప్రోత్సహించడానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా 50 ఏళ్ల క్రితం ఏప్రిల్ 1, 1973న కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ టైగర్’ ప్రారంభిందన్నారు. వన్యప్రాణుల ఆవాసాల సమగ్రాభివృద్ధి పథకంలో ఓ భాగమైన ప్రాజెక్ట్ టైగర్.. 18 టైగర్ రేంజ్ రాష్ట్రాల్లో అమలవుతోందని చెప్పారు. తెలంగాణలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, అమ్రాబాద్ సాంక్చురీ 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని, ఇవి కాకుండా 3,296 చ.కి. కి.మీ విస్తీరణంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ విస్తరించి ఉందన్నారు.
వివిధ ప్రాయోజిత పథకాలలో భాగంగా కేంద్రం 30 కోట్ల రూపాయలు బదిలీ చేసిందని.. ఇవి కాకుండా కేంద్రం తెలంగాణకు కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ కింద 3,110 కోట్లు విడుదల చేసిందన్నారు కిషన్‌రెడ్డి. తమది భారీ బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పులుల సంరక్షణకు కోటి రూపాయలు కూడా విడుదల చేయకపోవడం విచారకరన్నారు. దానివల్ల కవ్వాల్, అమ్రాబాద్ రిజర్వ్ లో అగ్నిమాపక కార్యకలాపాలు, ఇతర అవసరమైన కార్యక్రమాలకు సరైన ఆర్థిక సహాయం అందడం లేదని ఆయన ఆరోపించారు.