బండి సెటైరికల్ ట్వీట్
కేసీఆర్ మాటలు నమ్మితే ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్
రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3,016 నిరుద్యోగ భృతిని ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ హామీని గుర్తు చేస్తూ ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఓ నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్’’ అని రాసి ఉన్న ఓ ఫొటోతో పాటు సీఎం కేసీఆర్ అన్న అప్పటి మాటలను క్యాప్షన్ లో చేర్చారు. దాంతో పాటు మీరు దీనిని నమ్మితే ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు అంటూ సెటైరికల్ గా రాసుకొచ్చారు. బండి సంజయ్ షేర్ చేసిన ఈ ఫొటోలు‘‘మీ అకౌంట్ లో రూ.3,016 పడ్డాయి’’ అనే మెసేజ్ ఇంగ్లీష్ లో ఉంది. దాని కిందే సీఎం కేసీఆర్ నవ్వుతున్న ఫొటోను పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
బండి సంజయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు సైతం పలు సెటైరికల్ కామెంట్లు పెడుతున్నారు. మోడీ తాత తనకు రూ.15లక్షలు వచ్చాయని, మీకు వచ్చాయా బంటి అన్న అంటూ బీఆర్ఎస్ సపోర్టర్ ఒకరు కామెంట్ చేయగా.. ‘హుసేన్ సాగర్ లోకి కొబ్బరినీళ్లు’, ‘సిగ్నల్ ఫ్రీ సిటీ’, ‘ప్రతి మండలంలో 30 బెడ్ల ఆసుపత్రులు’, ‘రూ.500కోట్లతో కేసీఆర్ ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ సెల్’ అంటూ గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు.