జయశంకర్ భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలనే కేసీఆర్ కాపీ కొట్టారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం మాట్లాడుతూ.. వేలంపాట పెట్టినట్టుగా తాము అనౌన్స్ చేసిన పథకాలే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. డౌటేలేదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 80 సీట్లు గెలుస్తామన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందని తెలిపారు. ప్రియాంక మాటలు మహిళలకు భరోసా ఇచ్చేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు లేవని.. అందరం కలిసి పనిచేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.