ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడులో భారీ చోరీ జరిగింది. మణప్పురం గోల్డ్ లోన్ కంపెనీకి ఆ సంస్థ ఉద్యోగులే టోపీ పెట్టారు. కస్టమర్లు తాకట్టు పెట్టిన 11 కిలోల బంగారం తీసుకుని పారిపోయారు. కంకిపాడు మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచిలో పనిచేస్తున్న పావని మరో ఉద్యోగితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడింది. కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే ఓ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కంకిపాడు బ్రాంచిలో పనిచేస్తున్న పావని తన సహోద్యోగితో కలిసి ఈ చోరీ చేసింది. బ్రాంచ్ ఆఫీసులో ఉన్న సుమారు 6 కోట్ల రూపాయల విలువైన బంగారం ఎత్తుకెళ్లింది.
పావనితో పాటు మరో ఉద్యోగి విధులకు హాజరుకాకపోవడంతో బంగారం దొంగతనం బయటపడింది. దీంతో మిగతా ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆఫీసులోని రికార్డులను తనిఖీ చేయగా.. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం దాదాపుగా 16 కిలోలు ఉండగా అందులో 11 కిలోలు మాయం అయినట్లు బయటపడింది. దీనిపై కంపెనీ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దొంగతనంలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పావని కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలిస్తున్నట్లు తెలిపారు.