ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 కిలోల రికవరీ వెండి మాయమైన సంఘటన కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాది క్రితం కర్నూలు పంచలింగాలు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యాపారి వద్ద భారీగా వెండి పట్టుబడింది. ఆ వెండికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో చెక్ పోస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకొని తాలూకా పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. వెండికి సంబంధించిన బిల్లులు తీసుకువస్తే తిరిగి ఇస్తామని పోలీసులు ప్రకటించడంతో వ్యాపారి వెళ్లిపోయాడు.
అలా పోయిన వ్యాపారి నేటి వరకు తిరిగి రాలేదు. అయితే ఇటీవల వెండికి ధర పెరగడంతో తన వెండిని అప్పగించాలని పెనాల్టీ చెల్లించి తీసుకెళ్లేందుకు వ్యాపారి తిరిగి వచ్చాడు. దీంతో కంగు తిన్న పోలీసులు అదిగో ఇదిగో అంటూ గత వారం రోజులుగా అతన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పోలీసులు రికవరీ చేసిన వెండి మాయమైనట్లు బహిర్గతమైంది. కాగా ఇప్పటివరకు కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు సీఐలు మారడం జరిగింది. మరి ఏ సీఐ హయాంలో మాయమైందన్నది ప్రస్తుతం బేతాళ ప్రశ్నగా మారింది.