AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు… భారత్ పై ప్రభావం ఉంటుందన్న ఆర్థికవేత్తలు

ఇజ్రాయెల్ పై హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపుదాడులకు పాల్పడి 400 మందికి పైగా పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. నిన్న కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లు ప్రయోగించిన హమాస్… పారాగ్లైడర్లతో పెద్ద సంఖ్యలో మిలిటెంట్లను ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశపెట్టింది. హమాస్ మిలిటెంట్ల కాల్పులతో ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ పాలస్తీనా, గాజా స్ట్రిప్ ప్రాంతాలపై నిన్నటి నుంచి విరుచుకుపడుతోంది.

తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం గనుక సంభవిస్తే, ఆ ప్రభావం భారత్ పై గణనీయ స్థాయిలో ఉంటుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో భారత్ కు ముడిచమురు సరఫరా ఇబ్బందుల్లో పడుతుందని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే, అంశాలపై ఇప్పుడప్పుడే ఓ అంచనాకు రాలేమని, వేచిచూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఓ రీసెర్చ్ సంస్థ అధిపతి సుమన్ చౌదరి దీనిపై స్పందిస్తూ, పశ్చిమాసియాలో సంక్షోభం ముదిరితే అది ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందని, ఈ వివాదంలో కొన్ని దేశాలు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని వివరించారు.

ఇప్పటికే ఒపెక్ దేశాలు చమురు సరఫరాలో కోతలు విధించడంతో అంతర్జాతీయంగా ధరలు భగ్గుమంటున్నాయని, ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభంతో చమురు సరఫరా ఓ సవాల్ గా మారనుందని పేర్కొన్నారు.

ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ స్పందిస్తూ, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మొదట ప్రభావితమయ్యేది చమురు ధరలు, ఆపై కరెన్సీ ప్రభావితమవుతుంది అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం వస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10