సిక్కిం పర్యటనకు వెళ్లిన సీనియర్ నటి, కూచిపూడి నృత్యకారిణి సరళ కుమారి క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె నబిత వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండే సరళకుమారి ఈ నెల 2న స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు ఈ విషయం చెప్పారు. 3న ఆమె మరోమారు కుమార్తెతో మాట్లాడారు. ఆ తర్వాత మాత్రం ఆమె ఆచూకీ గల్లంతైంది. తల్లితో మాట్లాడేందుకు నబిత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడ అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆమె గల్లంతై ఉంటారని భావించారు. తన తల్లి ఆచూకీని గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఆర్మీ హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసినా కలవడం లేదని, తన తల్లి ఎక్కడుందో ఆచూకీ కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, నిన్న సాయంత్రం ఫోన్లో మాట్లాడిన నబిత.. సిక్కింలోని లాచెన్ ప్రాంతంలో తన తల్లి సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ అంజనీ కుమార్ స్పందించి సాయం చేయాలని వేడుకున్నారు.