రెండు వారాలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కనిపించట్లేదు. దాంతో ఆయన ఎందుకు కనిపించట్లేదు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఏదైనా బలమైన నిర్ణయం తీసుకునే సమయంలో… కొన్ని రోజులపాటూ కేసీఆర్ మీడియా ముందుకు రారు. ఇప్పుడు కూడా అలాంటిదేదో జరుగుతోందనీ, అద్భుతమైన సరికొత్త పథకాల రూపకల్పనలో భాగంగానే ఆయన మీడియా ముందుకు రావట్లేదని కొందరు ప్రచారం చేస్తే, ఆయనకు భారీ అనారోగ్యం వచ్చేసిందనీ, అందుకే మీడియా ముందుకు రావట్లేదనీ, ఆయన్ని మీడియా ముందు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ లాంటి పార్టీల నుంచి కొందరు నేతలు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.
సీఎం కేసీఆర్‌కి ఛాతిలో ఇన్ఫెక్షన్ వచ్చిందనీ, కొన్ని రోజుల కిందట వైరల్ ఫీవర్, తాజాగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్‌మెంట్ అందుతోందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, కేటీఆర్ నిన్న (శుక్రవారం).. వరంగల్ పర్యటనలో తెలిపారు.
సీఎం కేసీఆర్ వయసు 69 ఏళ్లు. ఈ వయసులో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం సహజం. ఆమధ్య హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవడంతో.. ఆ తర్వాత దోమల సంఖ్య బాగా పెరిగింది. దాంతో తెలంగాణలో వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి. సీఎం కేసీఆర్ కూడా వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు ప్రగతి భవన్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారు.