AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజధాని బస్సులో మంటలు..

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో రాజధాని బస్సు దగ్ధమైంది. మియాపూర్‌ డిపోకు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద స్కూటీని ఢీకొట్టింది. దీంతో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను అప్రమత్తం చేయడంతో అందరూ బస్సు దిగి పరుగులు తీశారు. స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడిని సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి‌ మునగాల మండలం ఇందిరానగర్ కు చెందిన రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే సురక్షిత ప్రయాణానికి మారుపేరైన తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులు వరుసగా మంటల్లో చిక్కుకోవడంపై ప్రయాణీకులు హడలిపోతున్నారు. నిన్న (మార్చి 29న) ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున ఏ ఏసీ బస్సు ఖమ్మం నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. చివ్వెం వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. బస్సును రిపేర్ కోసం సూర్యాపేట డిపోకు తరలిస్తుండగా.. సూర్యాపేట-ఖమ్మం రహదారిపైబస్సులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది.. సంఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో పూర్తిగా కాలిపోయింది. షాట్ సర్కుట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10