హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్య కేసు అందరికి తెలిసిందే. నవీన్ హత్య కేసును రాచకొండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ మర్డర్ వెనక ఉన్న మరో ఇద్దరు నిందితులను గుట్టురట్టు చేసిన పోలీసులు.. ఇటీవల అరెస్టయిన నిహారికారెడ్డి, హసన్‌లను, ప్రధాన నిందితుడు హరిహర కృష్ణ నుంచి నిజాలను రాబడుతున్నారు. అయితే ఈ కేసులో కీలక ఆధారమైన నవీన్ సెల్‌ఫోన్ ఏమైంది?..హత్య జరిగిన తర్వాత ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ నవీన్ సెల్‌ఫోన్‌ను ఏం చేశాడు..అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు నవీన్‌ను తానొక్కడినే హత్య చేశానని హరిహరకృష్ణ చెబుతున్న విషయాలు నమ్మశక్యంగా లేవని.. ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడు నవీన్‌ను తానొక్కడినే హతమార్చానని హరిహరికృష్ణ చెబుతున్నా.. పోలీసులు నమ్మడంలేదు. ఇంకా ఈ మర్డర్ వెనక కొందరు ఉండివుండవచ్చని పోలీసులకు అనుమానిస్తున్నారు. ఈ హత్య ఘటనలో మరికొంతమంది పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్య విషయాన్ని తెలిసినా చెప్పకపోవడం, నవీన్ శరీరభాగాలు మాయం చేయడంలో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించిన అతని స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారిక రెడ్డిని సోమవారమే అరెస్ట్ చేశారు. వీరిద్దరితోపాటు హత్య వీరిద్దరితోపాటు హత్య విషయం తెలిసి దాచిపెట్టి, హరిహరకృష్ణకు సహకరించిన ఇతరుల పాత్రపై కూడా దృష్టి సారించారు. హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం, అతడికి టచ్‌లో ఉన్న వ్యక్తులను ఎదురెదురుగా ఉంచి ప్రశ్నించడం, విడివిడిగా విచారించడంతో అసలు విషయాలు నిగ్గుతేలాయి. హరిహరకృష్ణ మర్డర్ చేసిన తరువాత హసన్, నిహారికలతోపాటు తండ్రికి, మరో ఇద్దరు స్నేహితులకు కూడా చెప్పినట్లు వదంతులు వస్తున్నాయి. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిజంగానే వారికి మర్డర్ విషయం చెప్పాడా? ఒకవేళ చెబితే వారు పోలీసులకు తెలియజేయకపోవడం వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నారు.
నవీన్ ఫోన్ ఎక్కడ..?
హరిహరకృష్ణ, హసన్, నిహారికరెడ్డి ఫోన్ డేటా డిలీట్ చేసినప్పటికీ పోలీసులు ఆ డేటాను రికవరీ చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలోనే నిహారిక డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లడైంది. నవీన్ హత్యకేసులో కీలక ఆధారమైన నవీన్ ఫోన్ ఇప్పటికీ పోలీసులకు దొరకనట్లు తెలుస్తోంది. నవీన్ ఫోన్ దొరికితే మరింత సమాచారం బయటకొచ్చే అవకాశం ఉంది. నవీన్ ఫోన్ దొరకనప్పటికీ, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిహారిక, హసన్‌లను కూడా పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. హరిహరకృష్ణ పోలీసు కస్టడీ సమయం ఈ రోజుతో ముగియనుంది.