అన్నదాతలపై రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రైతులపై ఆయన దుర్బాషలాడటంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. మీరు రైతులా? దున్నపోతులా? అంటూ సమావేశంలో రెచ్చిపోయారు. బహిరంగంగా రైతులపై ఇచ్చమొచ్చినట్లు మాట్లాడటం చిచ్చు రేపింది. మల్లారెడ్డి తీరుకు నిరసనగా రైతులు సమావేశంలోనే ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో చోటుచేసుకుంది. ఘట్కేసర్ పట్టణంలోని నారాయణ గార్డెన్‌లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సహకార సంఘం సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ఈ తరుణంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించారు. రైతులకు తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు.