లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై పొన్నం ఫైర్
ఒక మహిళ అయ్యుండి ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం చేయడం యావత్ మహిళా ప్రపంచానికి అవమానకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు ఈడీ అధికారులు నోటీసులివ్వడంపై ఆయన స్పందించారు.తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.స్వయంగా రామచంద్ర పిళ్లయే.. కవిత బినామీనని ఈడీ ఎదుట ఒప్పుకున్నారని.. దీనిపై కవిత తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవిత మంటగలిపారన్నారు.డబ్బులకు ఆశపడి మహిళలు చేయరాని లిక్కర్ వ్యాపారంలో కవిత భాగమయ్యారని ఆరోపించారు.గతంలో సోనియాగాంధీ సైతం ఈడీ కార్యాలయానికి వెళ్లారని,కానీ కవిత విషయంలో మాత్రం అధికారులు ఇంటికి వచ్చి విచారించారని గుర్తు చేశారు.లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉందని ఈడీ ఇన్నిసార్లు చెప్తున్నా .. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ,బీఆర్ఎస్ రెండూ కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.